పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలి : గవర్నర్‌‌‌‌ శుక్లా

పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలి : గవర్నర్‌‌‌‌ శుక్లా
  • ఇంధన పొదుపు కోసం పబ్లిక్​ ముందుకు రావాలని గవర్నర్‌‌‌‌ శుక్లా పిలుపు
  • ఇదే అంశంపై సీఎం, మంత్రులను కోరనున్నట్టు వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు  తెలంగాణ ప్రజలు ఇంధన పొదుపుకు ముందుకు రావాలని, ఇందుకోసం పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలని గవర్నర్ శివ్‌‌ ప్రతాప్ శుక్లా  పిలపునిచ్చారు. ఈ మేరకు గురువారం గవర్నర్ వీడియోను రిలీజ్ చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా  ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునివ్వడంతోపాటు తానే ముందుగా ఆచరణలో పెట్టారని గవర్నర్ పేర్కొన్నారు. భద్రతాపరమైన సమస్యలున్నప్పటికీ  ప్రధాని, కేంద్ర హోంమంత్రి తన కాన్వాయ్‌‌లోని వాహనాలను తగ్గించారని, వీరిని తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

అప్పుడే ప్రజల్లో అవగాహన పెరుగుతుందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ శాఖల్లో వాహనాల వినియోగాన్ని తగ్గించేలా సీఎం, మంత్రివర్గ సభ్యులు, అధికారులకు సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్లు గవర్నర్ తెలిపారు. రాజకీయ నాయకులు అవసరానికి మించి భారీ కాన్వాయ్‌‌ల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. అమెరికా–ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్నందున విదేశీమారకద్రవ్యాన్ని ఆదా చేయాలని గవర్నర్​కోరారు. ఇందుకోసం ప్రతి పౌరుడూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. తాను తెలంగాణ గవర్నర్‌‌‌‌గా బాధ్యతలు చేపట్టిన నుంచే వాహనాల వినియోగాన్ని తగ్గించానని గుర్తుచేశారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు వాహనాల వినియోగాన్ని మళ్లీ 50% వరకు తగ్గించాలని నిర్ణయించినట్లు శివ్‌‌ ప్రతాప్ శుక్లా వెల్లడించారు.

నషా ముక్త్‌‌ తెలంగాణ లక్ష్యంగా పని చేయాలి

మాదకద్రవ్యాల నిర్మూలనపైనా గవర్నర్ శివ్‌‌ ప్రతాప్‌‌ స్పందించారు. హిమాచల్ ప్రదేశ్‌‌లో తాను చేపట్టిన డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమం గ్రామస్థాయికి చేరుకుందని పేర్కొన్నారు. అదే తరహాలో తెలంగాణలో కూడా నషా ముక్త్‌‌ తెలంగాణ కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో అడ్మిషన్ ఫారమ్‌‌లలోనే ‘డ్రగ్స్​కు దూరంగా ఉంటాం, ఇతరులను కూడా దూరంగా ఉంచుతాం’ అనే ప్రతిజ్ఞ చేర్చాలని సూచించారు. యువత ద్వారా సమాజానికి గొప్ప సందేశం ఇవ్వవచ్చన్నారు. మాదకద్రవ్యాల వ్యతిరేక ఉద్యమంలో మీడియా కీలక పాత్ర పోషించాలని గవర్నర్ సూచించారు. హిమాచల్‌‌లో మీడియా సహకారంతో ఉద్యమం విజయవంతమైందని, తెలంగాణలో కూడా మీడియా ప్రాధాన్యతతో ముందుకు వస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.